మానవ చరిత్ర యొక్క ఆరంభములో ఇవ్వబడిన మోక్షమును గూర్చిన వాగ్దానమును ఇంతకుముందు మనము చూశాము. భ్రష్టత్వమునకు ఆకర్షితమైయ్యేది ఏదో మనలో ఉన్నదని మనము గుర్తించాము, అది మనము ఆశించు నైతిక స్వభావము విషయములో మన క్రియలు గురిని తప్పుటలో, మరియు మన అస్తిత్వము యొక్క స్వభావములో మరింత లోతుగా కనిపిస్తుంది. దేవుడు (ప్రజాపతి) సృజించిన మన నిజ స్వరూపము చెడిపోయింది. అనేక ఆచారములు, శుద్ధీకరణములు మరియు ప్రార్థనల ద్వారా మనము ఎంత ప్రయత్నించినా, మనకు మరింత శుద్ధీకరణ అవసరము అని భావించునట్లు మన భ్రష్టత్వము చేస్తుంది. పూర్ణ నిజాయితీతో జీవించుటకు చేయు ఈ “క్లిష్టమైన’ సంఘర్షణలో మనము తరచుగా అలసిపోతు ఉంటాము.
ఎలాంటి నైతిక నిర్భంధము లేకుండా ఈ దుష్టత్వము ఎదిగితే పరిస్థితులు చాలా త్వరగా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఇది మానవ చరిత్ర యొక్క ఆరంభములో జరిగింది. ఇది ఎలా జరిగిందో బైబిలులోని (వేద పుస్తకము) మొదటి అధ్యాయములు మనకు తెలియజేస్తాయి. దీనిని పోలిన వృత్తాంతము శతపథబ్రాహ్మణములో కనిపిస్తుంది. అక్కడ మానవులకు పితరుడైన మను మానవ భ్రష్టత్వము వలన కలిగిన తీర్పులో ఎలా బ్రతికాడో వ్రాయబడింది. అతడు ఒక గొప్ప పడవలో ఆశ్రయమును తీసుకొని బ్రతికాడు. నేడు నివసించుచున్న మానవులంతా అతని వారసులే అని బైబిలు (వేద పుస్తకము) మరియు సంస్కృత వేదములు రెండూ తెలియజేస్తాయి.
పురాతన మను – ఆంగ్ల పదమైన “మాన్” ఇతని నుండే వెలువడింది
ఆంగ్ల పదమైన ‘మాన్’ ఆదిమ జర్మనిక్ నుండి వెలువడింది. యేసు క్రీస్తు (యేసు సత్సంగ్) కాలములో నివసించిన రోమా చరిత్రకారుడైన టసిటస్ జర్మనీ ప్రజల యొక్క చరిత్రను గూర్చి ఒక పుస్తకమును వ్రాసి దానికి జర్మనియ అని పేరు పెట్టాడు. దానిలో అతడు ఇలా వ్రాశాడు
తమ ప్రాచీన వీరగాథలలో (అది వారి చరిత్ర) వారు భూమిలో నుండి పుట్టిన దైవమైన టుయిస్టోను మరియు అతని కుమారుడైన మన్నుస్ ను దేశము యొక్క పితరులుగాను స్థాపకులుగాను గౌరవించేవారు. మన్నుస్ కు ముగ్గురు కుమారులు ఉన్నారని వారు చెప్పారు, వారి నుండి అనేకమంది ప్రజలు జన్మించారు (టసిటస్. జర్మనియఅధ్యా 2, సూ. క్రీ.శ. 100లో వ్రాయబడినది)
ఈ పురాతన జర్మన్ పదమైన ‘మన్నుస్’ ఆదిమ-ఆంగ్ల-ఐరోపా పదమైన “మనుః” నుండి వెలువడింది అని పండితులు చెబుతారు (cf. సంస్కృతంలో మనుః, అవేస్టాన్ లో మను-,). కాబట్టి, ‘మాన్’ అను ఆంగ్ల పదము బైబిలు (వేద పుస్తకము) మరియు శతపథబ్రాహ్మణము మమ పితరుడు అని పిలచు మను నుండి వెలువడింది! శతపథబ్రాహ్మణమును క్రోడీకరిస్తూ ఈ వ్యక్తిని గూర్చి చూద్దాము. ఈ వృత్తాంతములో కొన్ని పాత్రభినయాలు భిన్నముగా ఉన్నాయి, కాబట్టి నేను సామాన్యముగా ఉన్న బిందువులను వివరిస్తాను.
సంస్కృత వేదములలో మనును గూర్చిన వృత్తాంతము
వేదములలో మను ఒక నీతిమంతుడు, మరియు సత్యమును వెదికేవాడు. మను పూర్ణ నిజాయితీగలవాడు గనుక, అతనిని ఆరంభములో సత్యవ్రత (“సత్యమును గూర్చి ఒడంబడిక చేసుకున్నవాడు) అని పిలచేవారు.
శతపథబ్రాహ్మణము (శతపథబ్రాహ్మణమును చదువుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి) ప్రకారం, రానున్న జలప్రళయమును గూర్చి ఒక అవతారము మనును హెచ్చరించాడు. ఆ అవతారము మొదటిగా అతడు నదిలో చేతులు కడుగుకొనుచుండగా ఒక శఫరి (చిన్న చేప) రూపములో ప్రత్యక్షమయ్యాడు. ఈ చిన్న చేప దానిని రక్షించమని మనును కోరగా, అతడు దయతో దానిని ఒక నీటి జగ్గులో వేశాడు. అది పెద్దదవుతూ ఉండగా, ముందు మను దానిని ఒక కుండలో తరువాత ఒక బావిలో వేశాడు. నిత్యము-ఎదుగుచున్న చేపకు బావి కూడా చిన్నదైనప్పుడు, మను దానిని ఒక చెరువులో వేశాడు. అది భూమికి రెండు యోజనాల (25 కిలోమీటర్లు) ఎత్తు, అంతే పొడవు, మరియు ఒక యోజన (13 కిలోమీటర్లు) వెడల్పు కలిగియుండెను. ఆ చేప ఇంకా ఎదగగా మను దానిని ఒక నదిలో వెయ్యవలసి వచ్చింది, ఆ నది కూడా చిన్నదైనప్పుడు, అతడు దానిని సముద్రములో వేశాడు, అప్పుడు అది మహా సముద్రము యొక్క వైశాల్యమంతటిని నింపివేసింది.
అప్పుడు ఆ అవతారము రానున్న వినాశనము కలిగించు జలప్రళయమును గూర్చి మనుకు తెలియపరచాడు. కాబట్టి మను ఒక పెద్ద పడవను నిర్మించి, దానిలో తమ కుటుంబమును, భూమిని తిరిగి నిండించుటకు పలు రకముల విత్తనములను, జంతువులను జమ చేశాడు, ఎందుకంటే జలప్రళయము తగ్గిన తరువాత సముద్రములు శాంతిస్తాయి మరియు భూమిని ప్రజలతోను జంతువులతోను నిండించవలసియుంటుంది. జలప్రళయము వచ్చినప్పుడు మను పడవను అవతారమైన చేప యొక్క కొమ్ముకు కట్టాడు. జలప్రళయము తరువాత ఆ పడవ ఒక పర్వత శిఖరము మీద ఆగింది. అప్పుడు అతడు పర్వతము మీద నుండి దిగి తన విమోచన నిమిత్తము అర్పణలను, నైవేద్యములను అర్పించాడు. నేడు భూమి మీద ఉన్న ప్రజలంతా అతని వారసులే.
బైబిలులో (వేద పుస్తకము) నోవహును గూర్చిన వృత్తాంతము
బైబిలులోని (వేద పుస్తకము) వృత్తాంతము ఇదే సన్నివేశమును వర్ణిస్తుంది, కాని ఈ వృత్తాంతములో మను పేరు “నోవహు.” బైబిలులోని నోవహును గూర్చిన వృత్తాంతమును గూర్చి మరియు సార్వత్రిక జలప్రళయమును గూర్చి చదువుటకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. సంస్కృత వేదములు మరియు బైబిలుతో పాటు, ఈ సన్నివేశమును గూర్చిన పలు స్మృతులు పలు సంస్కృతులు, మతములు మరియు చరిత్రల యొక్క చారిత్రిక పుస్తకాలలో భద్రపరచబడినవి. లోకము మస్టు పట్టినరాతితో నిండియున్నది, ఇది జలప్రళయ సమయములో ఏర్పడింది అనుటకు జలప్రళయమును గూర్చిన భౌతిక ఆధారము మరియు పురావస్తుశాస్త్ర ఆధారము ఉన్నాయి. కాని ఈ వృత్తాంతములో నుండి నేడు మనము నేర్చుకోవలసిన పాఠము ఏమిటి?
తప్పిపోవుట vs. కనికరమును పొందుకొనుట
దేవుడు భ్రష్టత్వమునకు (పాపమునకు) తీర్పు తీర్చుతాడా, మరివిశేషముగా మన పాపమునకు తీర్పు ఉంటుందా అని మనము ప్రశ్నించినప్పుడు, చాలాసార్లు దీనికి స్పందన ఈ విధంగా ఉంటుంది, “దేవుడు ఎంతో కనికరము, దయ కలిగినవాడు కాబట్టి ఆయన నాకు తీర్పు తీర్చుతాడు అని నేననుకోను, దానిని గూర్చి నాకు భయము కూడా లేదు.” నోవహును (మనును) గూర్చిన ఈ వృత్తాంతము పునర్విమర్శ చేయుటకు మనలను పురికొల్పాలి. ఆ తీర్పులో లోకమంతా (నోవహు మరియు అతని కుటుంబము మినహా) నాశనమైపోయింది. కాబట్టి ఆయన కనికరము అప్పుడు ఎక్కడ ఉంది? అది ఓడలో అనుగ్రహించబడింది.
దేవుడు తన కనికరము చొప్పున, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండిన ఒక ఓడను అనుగ్రహించాడు. ఆ ఓడలో ప్రవేశించి, కనికరము పొంది, రానున్న జలప్రళయము నుండి తప్పించుకొనుటకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉండినది. సమస్య ఏమిటంటే ఇంచుమించు ప్రజలంతా రానున్న జలప్రళయమునకు అవిశ్వాసముతో స్పందించారు. వారు నోవహును అపహాస్యము చేసి తీర్పు వస్తుంది అని నమ్మలేదు. కాబట్టి వారు జలప్రళయములో నాశనమయ్యారు. అయితే వారు ఓడలోనికి ప్రవేశించియుంటే తీర్పును తప్పించుకునేవారే.
ఆ దినములలోని ప్రజలు ఒక ఎత్తైన కొండ ఎక్కి లేక ఒక పెద్ద తెప్పను తయారు చేసుకొని రానున్న జలప్రళయమును తప్పించుకుందామని అనుకొనియుంటారు. కాని తీర్పు యొక్క పరిమాణమును, శక్తిని వారు చాలా తక్కువ అంచనా వేశారు. వారు కలిగియుండిన ఈ ‘మంచి ఆలోచన’లు వారిని ఈ తీర్పు నుండి తప్పించలేకపోయాయి; వారిని మరి భద్రముగా దాచగల ఒకటి వారికి అవసరమైయుండినది – అదే ఓడ. ఓడ నిర్మాణమును వారు చూసినప్పుడు, రానున్న తీర్పుకు మరియు అందుబాటులో ఉండిన కనికరమునకు అది చిహ్నముగా ఉండెను. నోవహు (మను) యొక్క ఉదాహరణను అనుసరించి నేడు అది మనతో కూడా అదే విధముగా మాట్లాడుతుంది, మరియు మన మంచి ఆలోచనల ద్వారాగాక దేవుడు సిద్ధపరచిన ఉపకారము ద్వారా కనికరమును పొందవచ్చని చూపుతుంది.
కాబట్టి నోవహు దేవుని కనికరమును ఎందుకు పొందాడు? బైబిలు ఈ క్రింది మాటను అనేకమార్లు పునరావృతం చేస్తుంది అని మీరు గమనించవచ్చు
తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను
నాకు అర్థమైన దానిని లేక నాకు నచ్చినదానిని లేక నేను సమ్మతించుదానిని నేను చేస్తాను అని నేను కనుగొన్నాను. రానున్న జలప్రళయమును గూర్చిన హెచ్చరికను గూర్చి మరియు భూమి మీద అంత పెద్ద ఓడను నిర్మించుటకు ఇవ్వబడిన ఆజ్ఞను గూర్చి నోవహు మదిలో కూడా అనేక ప్రశ్నలు ఉండినవని నేను ఖచ్చితముగా నమ్ముతాను. అతడు మంచివాడు, సత్యమును-అన్వేషించు పురుషుడు కాబట్టి అతడు దీనిని గూర్చి తర్కించి ఓడను నిర్మించమని ఇవ్వబడిన ఆజ్ఞను నిర్లక్ష్యం చేసియుండవచ్చు. కాని అతడు తనకు ఆజ్ఞాపించబడిన ప్రకారము యావత్తు చేసెను – అతడు అర్థము చేసుకున్నవి మాత్రమేకాదు, తనకు నచ్చినవి మాత్రమే కాదు, తనకు యుక్తమని అనిపించినవి మాత్రమే కాదు. ఇది మనము అనుసరించవలసిన గొప్ప ఉదాహరణగా ఉన్నది.
రక్షణ కొరకు ద్వారము
బైబిలు చెబుతుంది, నోవహు, అతని కుటుంబము మరియు జంతువులు ఓడలో ప్రవేశించిన తరువాత
అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.
ఆదికాండము 7:16
ఓడలోనికి ప్రవేశించుటకు నిర్మించబడిన ఒకేఒక్క ద్వారమును దేవుడు నియంత్రించాడు- నోవహు కాదు. తీర్పు వచ్చి నీరు ఎగసినప్పుడు, బయట ఉన్న ప్రజలు తలుపును ఎంత బలముగా కొట్టినా నోవహు తలుపు తెరవలేకపోయాడు. ఆ ఒక్క ద్వారము దేవుని నియంత్రణలో ఉండెను. అయితే అదే సమయములో లోపల ఉండినవారు నిశ్చయతతో విశ్రాంతిని తీసుకున్నారు ఎందుకంటే దేవుడు ఆ ద్వారమును నియంత్రించుచున్నాడు కాబట్టి ఏ గాలి లేక అల కూడా దానిని తెరువలేదు. దేవుని పోషణ మరియు కనికరము అను ద్వారములో వారు సురక్షితముగా ఉండిరి.
దేవుడు మార్పు చెందనివాడు గనుక ఇది నేడు మనకు కూడా వర్తిస్తుంది. మరొక తీర్పు రాబోవుచున్నదని – మరియు అది అగ్నితో కూడినదని – బైబిలు హెచ్చరిస్తుంది, కాని తాను తెచ్చు తీర్పుతో పాటు ఆయన కనికరమును కూడా అనుగ్రహిస్తాడని నోవహు చిహ్నము మనకు నిశ్చయతను కలిగిస్తుంది. మన అవసరతను తీర్చుటకు మరియు మనకు కనికరమును అనుగ్రహించుటకు ఏక ద్వారము గల ‘ఓడ’ కొరకు మనము వెదకాలి.
మరొకసారి బలులు
బైబిలు చెబుతుంది, నోవహు:
యెహోవాకు బలిపీఠముకట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.
ఆదికాండము 8:20
ఇది పురుషసూక్త యొక్క బలి ప్రణాళికను అనుసరిస్తుంది. నోవహుకు (లేక మనుకు) పురుష యొక్క బలిని గూర్చి ముందునుండే తెలుసు అన్నట్లు దేవుడు దానిని చేయబోవుచున్నాడు అని కనుపరుస్తూ రానున్న బలికి ఒక రూపకముగా అతడు ఒక పశుబలిని అర్పించాడు. వాస్తవానికి, ఈ బలిని అర్పించిన వెంటనే దేవుడు ‘నోవహును అతని కుమారులను ఆశీర్వదించి’ (ఆదికాండము 9:1) ప్రజలందరినీ మరొకసారి జలప్రళయముతో దండించను అని ‘నోవహుతో వాగ్దానము చేశాడు’ (ఆదికాండము 9:8). కాబట్టి నోవహు చేసిన ఆరాధనలో పశుబలి కీలకమైనదిగా అనిపిస్తుంది.
పునర్జన్మ – ధర్మశాస్త్రము ద్వారా లేక…
వేదముల పరంపరలో, ఒకని జీవిత వర్ణమును/కులమును సూచించు లేక నిర్థారించు మనుస్మృతిని మనునే వ్రాశాడు. జననమున మానవులంతా శూద్రులుగా లేక దాసులుగా జన్మిస్తారని, కాని ఈ బంధకము నుండి విమోచించబడుటకు రెండవ జన్మ లేక పునర్జన్మ మనకు కావాలని యజుర్వేదము బోధిస్తుంది. మనుస్మృతి వివాదాత్మకమైనది మరియు స్మృతిని గూర్చి భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తుంది. ఈ వివరాలన్నిటిని విశ్లేషించుట మన పరిధిలో లేదు. కాని, ఇక్కడ మనము చూడవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నోవహు/మను వారసులైన సెమిటిక్ ప్రజలు కూడా పవిత్రతను లేక శుద్ధీకరణమును పొందుటకు రెండు మార్గములను పొందుకున్నారు. ఒక విధానము శుద్ధీకరణములు, ఆచార శుద్ధీకరణలు మరియు బలులు కలిగియున్న ధర్మశాస్త్రము ద్వారా – ఇది మనుస్మృతిని పోలియున్నది. మరొక విధానము మరింత మర్మాత్మకమైనది, మరియు పునర్జన్మను పొందుకొనుటకు ముందు దీనిలో ఒక మరణము ఉంది. యేసు కూడా దీనిని గూర్చి బోధించాడు. ఆయన తన దినములలో ఒక మహాపండితునితో ఇలా చెప్పాడు
అందుకు యేసు అతనితో – ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
యోహాను 3:3
దీనిని గూర్చి మరిన్ని విషయములను తరువాత వ్యాసములలో చూద్దాము. కాని బైబిలుకు, సంస్కృత వేదములకు మధ్య ఇన్ని పోలికలు ఎందుకు ఉన్నాయో తదుపరి చూద్దాము.