Skip to content

నోవహు మరియు వరద వృత్తాంతం: ఆదికాండము 6-9

మానవ దుష్టత్వం

6 మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు2 దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.3 యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు.4 దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.5 మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు.6 తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.7 కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.నోవహు8 అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు.9 నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు.10 షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు.11 దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది.12 దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు.13 దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను.14 కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి.15 నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.16 ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దాన్ని చెయ్యాలి.17 విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి.18 కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు.19 నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి.20 అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి.21 తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి” అని చెప్పాడు.22 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.

ఆదికాండము 6

జలప్రళయం

7 యెహోవా “ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి.2 శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు, శుద్ధంకాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ రెండు,3 ఆకాశపక్షుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి.4 ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను” అని నోవహుతో చెప్పాడు.5 తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేశాడు.6 ఆ జలప్రళయం భూమిమీదికి వచ్చినప్పుడు నోవహుకు వయస్సు ఆరు వందల సంవత్సరాలు.7 నోవహు, అతనితోపాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ జలప్రళయం తప్పించుకోడానికి ఆ ఓడలో ప్రవేశించారు.8 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం శుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్షుల్లో నేలమీద పాకే వాటన్నిటిలో,9 మగ, ఆడ, జతలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరికి చేరాయి.10 ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి.11 నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి.12 నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిసింది.13 ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతో పాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు.14 వాళ్ళతోపాటు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పశువు, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానావిధాల రెక్కల పక్షులు ప్రవేశించాయి.15 శ్వాస తీసుకోగలిగి, శరీరం గల జీవులన్నీరెండేసి చొప్పున నోవహు దగ్గరికి వచ్చి, ఓడలో ప్రవేశించాయి.16 ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం శరీరం కలిగిన ఆ జీవులన్నీ, మగవిగా, ఆడవిగా, ప్రవేశించాయి. అప్పుడు యెహోవా, వాళ్ళను ఓడలో ఉంచి, ఓడ తలుపు మూశాడు.17 ఆ జలప్రళయం నలభై రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది.18 నీళ్ళు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు, ఆ ఓడ నీళ్ళ మీద తేలింది.19 ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి.20 ఉన్నత పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి.21 పక్షులు, పశువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు.22 పొడి నేలమీద ఉన్న వాటన్నిటిలో, నాసికారంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి.23 మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండాా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి.24 నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి.

ఆదికాండము 7

జలప్రళయం అంతం

8 దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి.2 అగాధజలాల ఊటలు, ఆకాశపు కిటికీలు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది.3 అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి.4 ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది.5 పదో నెల వరకూ నీళ్ళు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పదోనెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి.6 నలభై రోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి7 ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకూ ఇటూ అటూ తిరుగుతూ ఉంది.8 నీళ్ళు నేలమీదనుంచి తగ్గాయో లేదో చూడడానికి అతడు తన దగ్గరనుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు.9 భూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు.10 అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు.11 సాయంకాలానికి అది అతని దగ్గరికి తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు.12 అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు.13 ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది.14 రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది.15 అప్పుడు దేవుడు నోవహుతో,16 “నువ్వు, నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి.17 పక్షులను, పశువులను భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవినీ నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకుని బయటకు రావాలి. అవి భూమిమీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి” అని చెప్పాడు.18 కాబట్టి నోవహు, అతనితోపాటు అతని కొడుకులు అతని భార్య, అతని కోడళ్ళు బయటకు వచ్చారు.19 ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమి మీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలోనుంచి బయటకు వచ్చాయి.నోవహు యెహోవాకు బలి అర్పించడం20 అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు.21 యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.22 భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు” అని తన హృదయంలో అనుకున్నాడు.

ఆదికాండము8

నోవహుతో దేవుని నిబంధన

9 దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.2 అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి.3 ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను.4 కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను.6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.7 మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు.8 దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ,9 “వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను,10 మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను.11 నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు” అన్నాడు.12 దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే,13 మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.14 భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది.15 అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.16 ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు.17 దేవుడు “నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే” అని నోవహుతో చెప్పాడు.నోవహు, అతని కుమారులు18 ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి.19 వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.

ఆదికాండము9