Skip to content

మత్తయి 21: 23-23: 39

యేసుకు ఉన్న అధికారాన్ని మతపెద్దలు ప్రశ్నించడం

23 ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు.24 యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.25 యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు. అప్పుడు వారు, “మనం పరలోకం నుండి, అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అంటాడు.26 మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకుని,27 “మాకు తెలియదు” అన్నారు. అప్పుడాయన “అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను” అన్నాడు.ఇద్దరు కొడుకుల కథ28 ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు.29 అతడు, ‘నేను వెళ్ళను’ అని జవాబిచ్చాడుగానీ తరవాత మనసు మార్చుకుని వెళ్ళాడు.30 అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, ‘నేను వెళతాను’ అన్నాడుగానీ వెళ్ళలేదు.31 ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?” అని వారిని అడిగాడు. వారు, “మొదటివాడే” అని జవాబిచ్చారు. యేసు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.32 యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడ లేదు, అతనిని నమ్మలేదు.ద్రాక్ష తోట యజమాని, కౌలు రైతులు33 “ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు.34 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు.35 ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు.36 అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు.37 చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు.38 అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు.39 వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు.40 ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు.41 వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు.42 అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?43 “కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను.44 ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు.45 ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు, పరిసయ్యులు గ్రహించారు.46 వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.

మత్తయి21

పెళ్ళి విందు ఉపమానం

22 యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు,2 “పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది.3 ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.4 అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు.5 కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు.6 మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు.7 కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.8 అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు.9 కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు.10 ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది.11 “రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు.12 రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు.13 కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు.14 ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”హేరోదు అనుచర గణానికి యేసు జవాబు15 అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు.16 వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు.17 సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు.18 యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు?19 ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు.20 ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు.21 ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు.22 వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు.సద్దూకయ్యుల ప్రశ్నకు జవాబు23 అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి,24 “బోధకా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి’ అని మోషే చెప్పాడు గదా.25 మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు.26 ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు.27 వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.28 చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా?” అని అడిగారు.29 అందుకు యేసు, “మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు.30 పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు.31-32 చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’ అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు.33 ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు.పరిసయ్యుల ప్రశ్నలకు జవాబు34 ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు.35 వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి,36 “బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.37 అందుకు యేసు, “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.39 ‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు.పరిసయ్యులకు ప్రశ్న41 మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని,42 “క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించాడు. వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.43 అందుకు యేసు, “అయితే, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ44 నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు?45 దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?” అని వారిని అడిగాడు.46 ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.

మత్తయి 22

పరిసయ్యుల ఆగడాలు

23 అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,2 “ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు.3 కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు.4 మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.5 వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు.6 విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం.8 మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు.9 ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి.10 అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.11 మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి.12 తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.పరిసయ్యులకు యాతన13 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.14 మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు.15 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు.16 “అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు.17 బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా?18 అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు.19 అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా?20 బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.21 అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.23 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.24 అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు.25 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి.26 గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.27 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి.28 అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు.29 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు.30 ‘మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసే వాళ్ళం కాము’ అని చెప్పుకొంటారు.31 నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.32 ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి.33 “సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు.34 కాబట్టి వినండి! నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు. సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు.35 నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది.36 అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.యెరూషలేముకై విలాపం37 “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు.38 ఇదుగో, ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను39 ఇప్పటి నుండి మీరు ‘ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక’ అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను.”

మత్తయి 23